Friday, March 13, 2026

 వాలిన రెప్పలు నిద్రాముద్రలు కానక్కరలేదు

రాలిన విత్తులన్నీ వృక్షాలే కానక్కరలేదు
గరిక విత్తుకీ మఱ్ఱి విత్తుకీ మరీ తేడా ఉండదు
మంచిమాట గంధమంత పరిమళించకపోవచ్చు
గోముఖంతో పులులు మసిలేచోట విపరీతాలే ఎక్కువ
మౌనానికి నిశ్శబ్దానికి సామ్యంవున్నా అర్ధాలు వేరు
తత్వమసి అంటే అదే నువ్వు కానీ అదీ ఇదీ వేరు
ప్రజ్ఞానం పరబ్రహ్మమే ఐతే అజ్ఞానం అపరమౌనా
అధాతా భ్రహ్మ జిజ్ఞాసావిధాత విప్పాల్సిన ముడే
అర్ధనిమీలిత సౌనకముని చెప్పినవన్నీ కధలే
కానీ నైమిశాన్నించి మంచో చెడో
దండకారణ్యందాకా పరివ్యాప్తమైంది
కధాకాలమప్పుడే వ్యధాభరిత రామచరిత్ర
సుధామయూఖ కృష్ణ ప్రేమా వికసించి
ఇంకా పరిమళాలు వెదజల్లుతున్నాయంటే
చెప్పుకుంటూ పోయిన మంచీచెడూ
రాజుకుంటూ కల్పితమౌతూ
కాసారంలో తామరతంపరైనదనేగా
పరమార్ధం మాటెటున్నా కధ
కధగానూ సువిధ గానూ
సమిధ వెలిగించిన
తేజోమండలంగానూ
వెలిగిపోవడము
నిజమేగా
అయినా
నిదురపోయే రెప్పలు
మంచి కలలే కన్నయి
మనముందుతరాల్లో
వెలుగుని,సత్యాన్నీ
పరమార్ధాన్నీ పరికిస్తూ
మనిషి ముందడుగేస్తూనే వున్నాడు

No comments:

Post a Comment