Monday, September 2, 2019

ఎన్నాళ్ళో వెనక్కి మళ్ళి చూస్తున్నాను
పెరడూ వీధి కలగలుపుగా నీరు ఏరౌతోంది
పాకలో పళ్ళాలూ గిన్నెలూ,నీళ్ళుపడుతున్నాయి
మంచాలకిందకి పెట్టెలు,సరకులూ చేరిపోతున్నయి
అమ్మా నాన్నా హడావుడిపడిపోతున్నారు.
మెరుపులు చినుకుల్ని వెలిగిస్తున్నాయి
చేతులూ,కాళ్ళూ చెమ్మగిల్లిపోతున్నయి
తపతపలాడుతోంది హర్కేనులాంతరు
పాకనాలుగుమూలలూ మసకలాడే
నీడలు వూగివూడిపోతున్నతోరణాలే
పారాడే గ్రుడ్డివెలుగులో అక్కల ఒడి
వెచ్చనే,భయానికి ఎంత ఆసరా
అక్కలంటే దేవతలేగదూ,అవునూ
అక్కలేకాదు అమ్మా నాన్నాకూడా
ఎందుకంటే నాన్న చాలా పొడుగూ
మళ్ళీ మరీ పెద్ద, అమ్మకూడా
మరి మాకు చలి మాత్రం వుంది
భయమైతే అక్కలకి లేదనుకుంటా
మా ఇంట్లో ఒక పుష్పకవిమానముంది
అదే పెద్ద స్టీలు మంచం,దానిమీదే
చెల్లెళ్ళూ,తమ్ముళ్ళూ ఆరాత్రి పడుకుంట
అప్పుడుడప్పుడు వాన కొంచం తగ్గి
మళ్ళీ పేద్ధమెరుపుల్తో ముంచేస్తోంది
ఎంతపెద్ద చూరుంటే మాత్రం ఏంలాభం
గాలికి ఆకులు తేలిపోతున్నయి
తుఫానంటారా,ఇది అమ్మడుగుతోంది
ముసురే భయంలేదు,నాయనగారి మాట
కొంచం తగ్గినట్టుంది చాలసేపుతర్వాత
పెద్దగా చలిబాధ తెలీదు,కాని
తడుస్తూ జోగాడుతున్న మాకు
విడివడ్డ జడివాన సాగుడు
తెల్లారి కళ్ళునులుముకున్నప్పుడు
పాకచుట్టు పరచుకొన్న చెరువై
కరువులేదని అరిచే కప్పల కొలువై
మా ఇల్లు కొలను పాకైంది
వంటింట్లోకినీళ్ళుచేరి ఖాళీ గిన్నెలు
తూము దగ్గర పడవల రేవయ్యాయి
అప్పుడే లేచిగీరుగారంటున్నారు
తమ్ముళ్ళు చెల్లేళ్ళూ,ఇంతలో
చూరు పైన జర జర పాకుడే
లేచిన అమ్మ చూపు పైనే
తెగబారెడు త్రాచు పట్టు జారి
కూచున్న చిన్ని తలపైనుంచి
నేలమీదకి,చేష్టలుదాకి చూస్తున్న
అమ్మకు పై ప్రాణాలు పైపైకన్నట్లు
నాన్నగారు బిగుసుకు పోయిన సందర్భం
గడ్డకట్టుకున్న గ్జాపకమే
అది పడగలదో,కాదో,
దానికి భయమైనదోలేదో
కాని తడిచి,కదలాడే
గాలి పడగక్రిందుగా
జారిపోయిందినీళ్ళలోకి
ఇంకా చూరుక్రింది గడప
తడీ పొడీ అవుతోనేవుంది
కదులుతున్న నీటి అలలకి
నిన్నసాయంత్రపు కాగితపు పడవలు
ప్రళయంలో మునిగిన పెను నావల్లా
చెల్లాచెదురైనాయి దృశ్యమే
అది చెరిగేదేమీకాదు,ప్రతి
వానాకాలంలోనూ,ఏదో ఒకసారి
కళ్ళముందు ముద్దపెన్నుతో గీసిన
ఇంకీ పిక్చర్ లా కనిపిస్తోనేవుంటుంది