Shared with Friends
ప్రపంచంలో తటస్తపడేవాల్లందరూ బెహారులే
నాకళ్ళైనా నీ చూపైనా మొదటే వశమైతే
అర్ధమేముంటుంది అవగాహన సంపూర్ణమనడానికి
ఇక సంబంధంలోకి దిగితే సంకెళ్ళుపడ్డట్టే
ఆముష్మిక సుఖాలంటే అవి అర్ధశరీరంతోటీ
అరిషడ్వర్గాల తాలింపుతో పాకాన పడేదేమీ కాదు
వాసనలన్నీ ఘుబాళించే సౌగంధికాలు కానేకావు
పుట్టుకా చావూ వాసనల మొదలూ తుదీ అయినప్పుడు
వుప్పుని నోట్లోనూ నిప్పుని చేతిలోనూ పట్టుకు ప్రయాణిచాలి
చేదునీ మింగాలి అస్పృస్యతనీ చుట్టబెట్టుకోవాలి
నెగడులో బూడిద చల్లనిదని పరమశివుడు ధరించలా
ఏహ్యతారాహిత్యంలో పరిమళించే గుబాళింపే ఆయన
ఎవరి చెయ్యి పట్టుకు పరమ హంస వౌతావూ
పరమేశ్వరుని కరుణా పూరిత వీక్షణాన్ని అవలోకించకుండా
ఏవొక్కడో త్రిశంకు స్వర్గానికెగబాకుతోంటె
నువ్వూ నేనూ వాడి నీడపట్టుకు వేలాడితే
భళ్ళునవిచ్చిపోతుంది సుమా పచ్చి కుండ
పగటికలలుచూపేదారి ఎండమావులకి తీర్పవుతుంది
నువ్వుమెలకువలోకివచ్చే ప్రతిప్రయత్నం
నిన్ను సమాధుల్లోకి ఈడ్చే ప్రలోభపు మాయలే
ఎవరో ఒకరు గీత గోవిందంపాడుతూనే వుంటారు
విని తరించి విహంగ వీక్షణంతో విశ్వాన్ని దర్శించు
అదే జ్ఞానము పరేంగితమూ,అనుభవైక్యసిద్దమూ
No comments:
Post a Comment