కళ్ళు తుడుచుకున్నాము
ఎన్నాళ్ళయింది నన్ను నేను తలచుకుని?
కన్నీళ్ళయిపోయాయి;తల వంచుకు
వాపోయాను ఏమయిపోయానిన్నాళ్ళూ,
కళ్ళముందే వెళ్ళిపోయిన వాళ్ళు
కలలోనైనా కనిపిస్తారేమోకానీ,
విలువల రాహిత్యంలో విడిపోయినవాళ్ళు
ఎదురుపడినా, నుదురు చిట్లించి
కలతల మసిబారిన భూతద్దంలో
తప్పులు తలుచుకు తల తిప్పుకుంటారు.
అమ్మా నాయనా మమ్మల్ని మన్నిచండి
అన్నదమ్ములమే, మిమ్మల్ని పంచుకున్నాము.
కంచాలు పంచుకునే తొందరలో తొణికిన
స్వప్నాలుగా మిమ్మల్ని మిగుల్చుకున్నాము.
కాలం చేసిన అమ్రుత మూర్తి అభాండాల తాకిడికి
మ్రుతమైపోయింది. అంతా అయిపోయిన తర్వాత,
చితి దగ్గర తలుచుకుంటూ కళ్ళు తుడుచుకున్నాము.
No comments:
Post a Comment