స్పందనలన్నీ
స్పందనలన్నీ సుఖ బిందువు చుట్టూ
అందీ అందక విస్తరించే విష వలయాలు.
గిజిగాడి గూడూ,తీతుగోడూ,
ఖేదామోదిత రస స్పందనలే.
మనసా శరీరాన్ని కబళించకు
అశరీరులు దిసమొలమొగ్గలయ్యె
అనసూయ పొత్తిలియెత్త,కనుగొంటే,
మనసుకు అసూయ కుచేలమే.
గుర్రమెక్కిన మనసు తగులుకున్న
తోడుకోసం బుర్రమొత్తుకు బుద్ధి ఏడ్చినా
తగలడిపోవడానికి మడి విప్పేస్తుంది.
ముడిపడ్డ పీట మనసు వెర్రి కుదిరింది
తలరోకలి చుట్టమని చుట్టపక్కాలతో
మొర్రి కోరిక కోరుతూ వ్యసనపు వూబి
బురదలో దిగ దూరి పోయేను.
అనంతానంత జీవకోటి సంతానంలో
తొలితొల్లింటినించీ నేనొంటరినే
నే నేర్చిన కూటి విద్యలు
కూకటి వ్రేళ్ళతో అకాల కాల
ప్రభంజనానికి కాలం చేస్తున్నాయి.
విచారచార మస్తిష్కానికి
ఏ గురుకృపారసప్రసాదమమృతమౌనో.
నేనొంటరిని. తుంటరిమనసు
బంధ సంబంధ వ్యామోహగంధ
బంధుర అంధకార కారకమే.
మెధోమధనము బహుదా శ్రమైక్యమే.
బాహువులు రెండూ,బృహత్ప్రయత్నంగా
శిరసు నొడిసి పట్టవలెనట.
గిర్రున దిరిగెడి బుర్రపై కొర్రునిడవలెనట.
భయవిహ్వల భరిత చరిత మనసా!
తమసా నదిలో స్నానమాచరించి
సామ గానము చేయి,కామ
క్రోధాది షడ్భఋత్రుకవైన నీవు,
పంచమవి,సంచిత కర్మలను
చత్వార విచారములో తుడిపి
,త్రయీ గుణములతో ద్వయీ
గణ్యాగణ్య సత్యము తెలిసికో.
ఏకమెవాద్వితీయమైన
బ్రహ్మ జిజ్గ్నాశ నీదౌతుంది
No comments:
Post a Comment