Tuesday, September 8, 2015

నా మనస్సునెవరో పలకరిస్తున్నట్లుంది





నా మనస్సునెవరో పలకరిస్తున్నట్లుంది.
ఓయీ వెర్రివాడ!,ఎవరాపిలిచేదీ?
నిన్నే నెర్రెలెంట పరువెత్తేనిన్నే.
సరే,పరిగెట్టేనన్నెలాగుర్తించావూ,
పనిగట్టుకెందుకు పిలిచావు?
'నే'ననుకునే నువ్వు అహానివికాబట్టి,
ఏ రంధ్రంలోంచి జారిపోతావో
ఏ గహ్వరాన్ని నీ స్వర్గమనుకుంటావో
నీ జిహ్వాగ్రాన్న ఏ శనినంటబెట్టుకుంటావో
తలుపులన్నీ తెరచి చీకటిలోనిండిపోతావోనని
నే నహరహరమూ, నీ వికారాలనీ అనుగమించి
నిన్ను నిలవరించడానికే నీవెంటపడుతూంటాను.
నువ్వు శరీరివి కాని 'బొందవీ కావు,చపలవి.
నిన్ను మనసంటారు. కరచరణాలూ,స్పర్శా,
వినికిడి,చూపూ రూపూ అంతా నెనేననుకుంటావు.
స్పందనల ఆటుపోట్లకి చలించిపోయే నిన్ను
శీర్ణమేఖలము జీర్ణవస్త్రమైనప్పుడు
కవచ కుండలాలు దొక్కచీల్చే నక్కకడ్డమైనప్పుడు
నువ్ ఘొల్లున ఏడుస్తావు. కర్ణుడూ దుర్యోధనుడూ
, శకునీ దుశ్శాసనుడూ, అందరూ
,అహంతోసహా బొందని వదిలేశారు.
నీవనుకునే 'నే'లో, న ద్రుతాన్ని
తీసి చూస్తే నెనే నిన్ను పలకరించేది
నిలవరించేది నన్ను ఆత్మ అని సంభోదిస్తారు.
నేను చిన్న మెలకువని మాత్రమేసుమా
మొలక లాంటి చిరురూపకళికని
పదార్ధములేని తొందర్గా అర్ధం
కాని ప్రతిపదంలోనూ లయించిన
నిఘూడర్ధాన్ని పరమాన్నాన్ని,
ప్రత్యాన్ని,ప్రాణాన్ని,సర్వాన్ని
కాని కనుగొంటేనే సుమా,అప్పుడు మోక్షాన్ని
, అక్కడ కైవల్యాన్ని,అని వైష్ణవులంటారు.

No comments:

Post a Comment