ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తేతి అహఃర్ మనిష్యేనః అవునా!
అప్పుడు అంటే ఈమాటలువిననప్పుడు చేసినవన్నీతప్పులే?
మై గాడ్ తప్పదన్నమాట పునరపి జననీ జఠరేశయనమ్ కాని
మనసుకీ యింగితమప్పుడు సంగతమయ్యేనా, అయ్యయ్యో
అప్పలాచార్య స్వామి శ్రీభాష్యమప్పుడు చక్కగా వినిపించుకుంటే
ఇప్పటి టీకా తాత్పర్యాలవెతుకులాట ఆపైన పునర్జన్మ పితలాటం
యస్ త్వ అవిఙ్ఞానవాన్ భవతి అయుక్తేన మనసా సదా
తస్యేన్ద్రియాణి' అవును కన్నూ కాలూ కుంటిగుర్రంలా జిహ్వ
ముక్కు బాలాజీ మిఠాయి కొట్టు దాటుకుంటూ
నల్లమందు సందులోంచిదిక్కులు చూసుకుంటూ
జండాపంచారోడ్డు గుండా కళ్ళు వళ్ళు విరుచుకు
పగటినిద్రకు తయారౌతున్న కొంపలగుండా
దేవీచౌక్ దాటి కాళ్ళీడ్చుకుంటూ కాలేజీ కెళ్ళే
యేవీరాని తెలియని నాకు స్వామీ నాగేశానంద
"నామాలబ్బాయ్ రామకృష్ణ మఠం నీకు బెటరు
అన్నప్పుడు వెర్రి మాటలుమాని చేరుంటే
బలే గత జల సేతు బంధన'మే యీ విచారం
అసలే టైమ్ లేదు మళ్ళీ విచారప్పీరియడొకటి
సరే ఆత్మ మనలో సారీ 'మనసు'లో' కొంచం
దూరదండి, ఆనీడలో, కాదు ఆ యెండలో,
అంటే, ఆ వెలుతురులో పొరపాటునైనా,
ప్రతి ఫలిస్తే అప్పుడు ఇంద్రియాలనే గుర్రాలు
కర చరణాదులనే చక్రాలతో సద్యోమార్గంలో
దృక్ శ్రవణ మిత్రత్వంతో మనోఙ్ఞ ప్రయాణమే
ఎవరికి నే ననే నాక్కాదు, నాలో జీవుడికిట!
నిజమని సత్యమని స్పృహ చెబుతోంది!
కాని అయ్యో గురువన్నమన్నాద ఏవచ
అర్ధంకాలా, మళ్ళీ అన్నమన్నాద రుచి
రుచిరార్ధ్ర జిహ్వగ్ర గ్రంధుల బంధితమైనది!
లెక్కలమాష్టారూ పిజిక్సు అమ్మ
నీలంగా వుండే వెలుగూ ఐసోటోప్
ఆరాటం ఆబ ఆత్మానందం హంబగ్
కొట్టి పారేసిన మనసుకు స్ధిరమైంది,
ఆకలో అసహనమో ఆవేశమో!
యాభైయ్యేళ్ళ తర్వాత మళ్ళీ
బతికి బలుసాకు తిన్న తరవాత
ఏమి తిన్నాడో శంకర భగవత్పాదుడు
చారచర అచర కార క్షార కర వికార
పర అపర పరాత్పర వర వివర
విషయాలుసవరం చేశాడుగదా!
కనీసం చలంతోబాటు కలం
పట్టీరాసిన దిక్కుమాలిన
కట్టుకధలతోపాటు సాపాటు
లేకూన్నా ఒక్క శ్రవణం
ఒఖ్ఖ మననం ఓఖటైనా
అభ్యసనమ్ చేసుంటే!!!
..
No comments:
Post a Comment